: ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. ఆ భూమి తమదేనని చైనా కొత్త మ్యాప్ విడుదల.. మండిపడ్డ భారత్
చైనా మరోసారి దుస్సాహసం చేసింది. ప్రస్తుతం భారత్, చైనా, బూటాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అటువైపు నుంచి చైనా.. ఇటువైపు నుంచి భారత్ తమతమ బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఈ నేపథ్యంలో మరింత రెచ్చగొట్టేలా చైనా.. కొత్త మ్యాప్‌ను విడుదల చేసి, అందులో భారతదేశం, భూటాన్ లోని పలు భూభాగాలు తమవేనని చెప్పుకుంది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఆ మ్యాప్ ప్రకారం డోకా లా పాస్ వద్ద తమ భూభాగంలోకి భారత సైన్యం చొరబడిందని పేర్కొంది.
భూటాన్, చైనా స్ట్రాటజిక్ ట్రై జంక్షన్ విషయంలో భారత్, భూటాన్ ల వాదన, చైనా వాదన భిన్నంగా ఉన్నాయి. గిప్‌మోచీ పర్వతం వద్ద ట్రై జంక్షన్ ఉందని పేర్కొంటున్న చైనా, అది 1890 నాటి బ్రిటన్-చైనా ఒప్పందంలో భాగమని అంటోంది. ఈ ట్రై జంక్షన్‌ను చుక్కల గీతతో ఆ మ్యాప్ లో చైనా చూపిస్తోంది. దానికి దక్షిణ దిశలోని డోక్లామ్ పీఠభూమి ప్రాంతం తనదేనని చైనా పేర్కొంది. దీనిపై భూటాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది తమ భూభాగమని భూటాన్ చేస్తోన్న వాదనతో ఇండియా ఏకీభవిస్తోంది.
ఆ ప్రాంతంలోనే చైనా ప్రస్తుతం రోడ్డు నిర్మాణం చేపట్టింది. చైనా తాజా చర్యపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చైనా చర్య తీవ్ర ఆందోళనకరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా చర్యలతో ఇండియాకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని చైనాకు స్పష్టం చేసింది. 2012లో భారత్‌తో చైనాకు కుదిరిన ఒప్పందాన్ని తెలుపుతూ ట్రై జంక్షన్ వంటి సరిహద్దుల వద్ద ఏవయినా నిర్మాణాలు చేపడితే ఆయా మూడు దేశాలు కలిసి ఆమోదం తెలపాల్సి ఉంటుందని చెప్పింది.