: రియల్ హీరో విశాల్.. బెంగళూరు నడిబొడ్డులో కావేరీ జలాల గురించి మాట్లాడిన వైనం!


హీరో విశాల్ ధైర్యసాహసాలు ఇప్పటికే అందరికీ తెలుసు. తాను అనుకున్న దానికోసం ఎంతటి సాహసమైనా చేసే విశాల్... తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం ఎన్నికల్లో వైరి పక్షాలను ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే, కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ జలాల కోసం తమిళ స్టార్లు రజనీకాంత్, కమలహాసన్, విజయ్ లాంటి ప్రముఖులంతా చెన్నైలో దీక్షలు, నిరాహారదీక్షలు చేయడం అందరికీ తెలిసిందే. చెన్నైలో దీక్షలు చేయడంలో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. కానీ, కర్ణాటకకు వెళ్లి కావేరీ జలాల కోసం గళం విప్పడమంటే మామూలు విషయం కాదు.

కానీ, విశాల్ అదే చేశాడు. బెంగళూరులో జరిగిన ఓ కన్నడ సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరైన విశాల్ మాట్లాడుతూ, కావేరీ జలాల గురించి ప్రస్తావించాడు. అంతేకాదు తమిళంలోనే ప్రసంగించాడు. నీళ్లు అడగడం తమ హక్కు అని... దాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అన్నాడు. తమిళం మాట్లాడటం తనకు గర్వకారణమని... మాట్లాడకుండా తనను ఎవరూ ఆపలేరని చెప్పాడు. మనమంతా భారతీయులమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. కర్ణాటకలో ఉన్న తమిళులను మీరు కాపాడాలని... అలాగే, తమిళనాడులో ఉండే కన్నడిగులను తాము రక్షిస్తామని చెప్పాడు. తమిళనాడులో సినిమా షూటింగ్ ల కోసం వస్తే అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపాడు. ఫంక్షన్ ముగిసిన తర్వాత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తల్లికి నివాళి అర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లాడు విశాల్. 

  • Loading...

More Telugu News