: జీఎస్టీ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: నారా బ్రాహ్మణి
జీఎస్టీ వల్ల దేశానికి ఎంతో ఉపయోగం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ చాలా మంచిదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయంలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హెరిటేజ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణితో పాటు, అపోలో హాస్పిటల్స్ సీఎండీ సంగీతారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బ్రాహ్మణి జీఎస్టీని అద్భుతమైన ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. ప్రజలకు ఎంతో అవసరమైన పోషకాహారాలపై జీరో జీఎస్టీ పెట్టడం గొప్ప నిర్ణయమని కితాబిచ్చారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి, కంపెనీలకు, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.
తాము నిర్వహిస్తున్న డెయిరీ బిజినెస్ కు కూడా జీఎస్టీ ఎంతో మేలు చేస్తుందని బ్రాహ్మణి అన్నారు. రానున్న రోజుల్లో ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కడైతే ట్యాక్స్ తగ్గిందో... ఆ తగ్గింపు మొత్తాన్ని కస్టమర్ కే తాము అందించబోతున్నామని తెలిపారు. ట్యాక్స్ పెరిగిన చోట కూడా ధరలను పెంచకుండా, వినియోగదారులపై భారం వేయకుండా ముందుకు వెళతామని చెప్పారు.
జీఎస్టీపై సామాన్యుల్లో నెలకొన్న ఆందోళన గురించి ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పుడు ప్రజలు ఆందోళనకు గురవడం సాధారణమే అని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారని... ఇప్పుడు సంతోషంగా ఉన్నారని తెలిపారు. జీఎస్టీ విషయంలో కూడా త్వరలోనే వారి ఆందోళనలన్నీ తొలగిపోతాయని చెప్పారు. రెండు నెలల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు.