: నాన్న ఉన్నప్పుడు అటువైపు కూడా వెళ్లలేదు.. చంద్రబాబు రైతుల ఆత్మబంధువు: బాలకృష్ణ
తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని, ఒక్క పని కూడా చేయించుకోలేదని, కనీసం సెక్రటేరియట్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నిన్న సాయంత్రం నెల్లూరులో జరిగిన నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన, ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడారు.
బడుగు, బలహీనవర్గాలకు ఉన్నత పదవులు దక్కేలా చేసిన ఘనత తన తండ్రికే దక్కుతుందని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు రైతుల ఆత్మబంధువని కొనియాడారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. చంద్రబాబులా కష్టపడుతున్న ముఖ్యమంత్రి దేశంలో మరెవరూ లేరని అన్నారు. మరో పదేళ్లపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు.