: మరో రెండేళ్లు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేది అతనే... జూనియర్ జట్ల కోచ్ గా ద్రవిడ్ కొనసాగింపు!


మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తూ టీమిండియాకు అద్భుతమైన రిజర్వ్ బెంచ్ ను తయారు చేయడంలో దిగ్గజ మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సిద్ధహస్తుడు. ద్రవిడ్ జూనియర్ జట్లకు కోచ్ అయిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా రిజర్వ్ బెంచ్ బలంగా తయారైంది. ద్రవిడ్ శిక్షణలో యువ క్రికెటర్లు సత్తాచాటుతూ టీమిండియాలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలతో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ద్రవిడ్ జాతీయ జట్టుకు వర్థమాన క్రీడాకారులను తయారు చేసేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ ను మరో రెండేళ్లపాటు జూనియర్ జట్లకు కోచ్ గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది.

దీంతో భారత్‌-ఎ, అండర్‌-19 జట్లకు కోచ్‌ గా రాహుల్‌ ద్రావిడ్‌ కొనసాగనున్నాడు. 2015లో జూనియర్ జట్ల కోచ్ గా ఎంపికైన ద్రవిడ్ 2019 వరకు కోచ్ గా కొనసాగనున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ, గత రెండేళ్లుగా యువ ప్రతిభను వెలికితీయడంలో ద్రావిడ్‌ కీలకపాత్ర పోషించాడు కాబట్టి, మరో రెండేళ్లపాటు అతన్నే కొనసాగించాలని భావిస్తున్నాం. అతని శిక్షణలో మరెందరో యువ క్రికెటర్లు భారత క్రికెట్‌ కు పరిచయం అవుతారని ఆశిస్తున్నామని అన్నారు. తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ, ద్రవిడ్ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. కాగా, ద్రవిడ్ శిక్షణలో భారత్‌-ఎ జట్టు తొలుత ఆస్ట్రేలియాతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ ను కైవసం చేసుకోగా, అండర్‌-19 జట్టు 2016 వరల్డ్‌ కప్‌ లో రన్నరప్‌ గా నిలిచింది.

  • Loading...

More Telugu News