: న్యూయార్క్ ఆసుపత్రిలో తుపాకితో విరుచుకుపడిన మహిళా డాక్టర్.. ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో కాల్పులు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. ఉద్యోగం పోయిందన్న బాధలో ఉన్న ఓ మహిళా డాక్టర్ న్యూయార్క్ సిటీ ఆస్పత్రిలో శుక్రవారం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ ఫిజీషియన్ ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు వైద్యుల పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం ఆమె కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. కాల్పులు జరిగిన సమయంలో ఆసుపత్రి రోగులతో రద్దీగా ఉంది. ఘటనతో భయభ్రాంతులకు గురైన వైద్యులు, రోగులు పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం నెలకొంది.
బ్రోంక్స్-లెబనాన్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితురాలు తనను తాను సజీవ దహనం చేసుకునేందుకు ప్రయత్నించిందని, అయితే చివరికి తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకుందని పోలీస్ కమిషనర్ జేమ్స్ ఒనీల్ తెలిపారు. ఇదో ఘోరమైన దుర్ఘటన అని మేయర్ బిల్ డి బ్లాసియో పేర్కొన్నారు. నిందితురాలిని ఇప్పటి వరకు గుర్తించలేదని, అయితే ఆమె ఈ ఆసుపత్రి మాజీ ఉద్యోగి అని ఒనీల్ తెలిపారు. కాగా, నిందితురాలు డాక్టర్ హెన్రీ బెల్లో (45) అని మీడియా చెబుతోంది. తన టెర్మినేషన్‌ను తప్పించుకునేందుకు 2015లో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు పేర్కొంది.