: ధోనీ రికార్డుల వెల్లువ.. తన ఖాతాలో మరో రెండు రికార్డులు వేసుకున్న మిస్టర్ కూల్!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలోకి మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత్ బ్యాట్స్‌మన్‌గా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 15వ పరుగు తీసిన ధోనీ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 78 పరుగులు చేసి మొత్తం 9,442 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 11,363 పరుగులతో సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో, 10,889 పరుగులతో రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉన్నారు. అజారుద్దీన్ 9,378 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
అలాగే ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన ధోనీ వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 322 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 476 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత క్రిస్‌గేల్ (434), బ్రెండన్ మెకల్లమ్ (398), సనత్ జయసూర్య (352) సిక్స్‌లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కీపర్ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 13,341 పరుగులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా 9,442 పరుగులతో ధోనీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.