: గగనం నుంచి గ్రహణ దర్శనం.. విమానయాన సంస్థ ఏర్పాట్లు!
గ్రహణం రాబోతుందని తెలిసి, ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కళ్లద్దాలు, ఎక్స్‌రే ఫిల్ములతో సిద్ధమవడం మనందరికీ తెలుసు. తీరా గ్రహణం వచ్చే సమయానికి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం వల్లనో లేక పొగమంచు వల్లనో చేసుకున్న ఏర్పాట్లన్నీ వృథా అవుతాయి. ఛ.. ఆకాశంలో మబ్బుల మీది నుంచి చూసే అవకాశం ఉంటే బాగుండునని అప్పుడనిపిస్తుంది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కి కూడా ఇలాగే అనిపించింది. అందుకే గ్రహణం రోజు ఒక విమానం నిండా ప్రయాణికులకు మబ్బుల మీదుగా గ్రహణాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఎవరికి పడితే వాళ్లకి ఈ విమానంలో సీటు ఇవ్వడం కష్టమైన పనే. అందుకే ఆ అదృష్టవంతులను ఎంచుకోవడం కోసం జూలై 21 నుంచి సోషల్ మీడియాలో అలస్కా ఎయిర్‌లైన్స్ పోటీలు నిర్వహించనుంది. పోటీలో గెల్చిన వారికి మాత్రమే సీటు లభిస్తుంది. ఆగస్టు 21న ఏర్పడనున్న సూర్యగ్రహణాన్ని చూపించే ఈ విమానం పోర్ట్‌లాండ్ నుంచి బయలుదేరుతుంది. హాయిగా పసిఫిక్ మహాసముద్రం మీద ఎగురుతూ గ్రహణాన్ని వీక్షించే అవకాశాన్ని అలస్కా ఎయిర్‌లైన్స్ గతేడాది కూడా కల్పించింది. ప్రస్తుతం ఏర్పడనున్న సూర్యగ్రహణం అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతం నుంచి ప్రారంభమై దక్షిణ కరోలినాలో ముగియనుంది.