: విశాఖలో ఆ రోజు నాకు బోర్డింగ్ పాస్ ఇప్పించింది అశోక్ గజపతిరాజే!: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు ఇరకాటంలో పడ్డారు. విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ సిబ్బందితో జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల గొడవపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై దివాకర్ రెడ్డితో 'రిపబ్లికన్ టీవీ' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయం బయటపడింది. ఈ సంఘటన జరిగిన రోజున అశోక్ గజపతిరాజు విమానాశ్రయంలోనే ఉన్నారని చెప్పారు.
‘స్టేషన్ మేనేజర్ ను ఆయన పిలిచారు. రెడ్డి ఏది అడుగుతున్నారో అది ఇవ్వండి’ అని అశోక్ గజపతిరాజు ఆదేశించినట్టు దివాకర్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజున అదే విమానంలో విశాఖ నుంచి హైదరాబాద్ కు తాను వచ్చానని చెప్పారు. ఈ సంఘటనపై విచారణకు మంత్రి ఆదేశించడంపై జేసీని ప్రశ్నించగా, ‘ఆయన రాజకీయనాయకుడు కాదు.. అధికారి. ఆయన రాజకీయనేతగా పనిచేయడం లేదు.. అధికారిలా పనిచేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, జేసీ గొడవతో తనకు ఎటువటి సంబంధం లేదని అశోక్ గజపతిరాజు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.