: ఐసిస్‌తో సంబంధం తెంచుకోం: ఖతార్
ఉగ్రసంస్థలకు అండగా ఉందనే ఆరోపణలతో ఖతార్ తో నాలుగు అరబ్ దేశాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. తమతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలంటే... ఉగ్ర సంస్థలతో సంబంధాలను పూర్తి స్థాయిలో తెంచుకోవాలని షరతు విధించాయి. ఈ నేపథ్యంలో ఖతార్ స్పందిస్తూ ఐసిస్, ఆల్ ఖైదా, లెబనీస్ షియా టెర్రరిస్ట్ గ్రూపులతో తాము తెగదెంపులు చేసుకోలేమని... ఎందుకంటే ఆ గ్రూపులతో తమకు సంబంధాలే లేవని ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి తోడు ఆయా దేశాలు డిమాండ్ చేసినట్టుగా ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్ ను తమ దేశం నుంచి బహిష్కరించలేమని... ఎందుకంటే, అలాంటివారు తమ దేశంలో లేరని చెప్పింది.
తమను బహిష్కరించిన దేశాల డిమాండ్లను అంగీకరించాలంటే... తమకు కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయని ఖతార్ తెలిపింది. అనుచితంగా ఉన్న డిమాండ్లను తమ ముందు పెట్టారని, తమకు డెడ్ లైన్ కూడా విధించారని... ఇది తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే అవుతుందని పేర్కొంది. అరబ్ దేశాలు పంపిన డిమాండ్లపై తాము అమెరికా, కువైట్ లతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.