: జీఎస్టీ జేగంటకు వేళాయె.. అందరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు!

వస్తు సేవల పన్ను, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ. దీన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అర్ధరాత్రి 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ గంట మోగించి మరీ ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప‌్పటి నుంచి ఇలా అర్ధరాత్రి సమావేశం ఏర్పాటు చేయడం ఇది నాలుగోసారి అవనుంది. పన్ను సంస్కరణను ఇలా అర్ధరాత్రి చేయడం కూడా కాంగ్రెస్ హాజరుకాకపోవడానికి ఒక కారణం. కొన్ని ప్రతిపక్షాలు కూడా ఈ వేడుకకు హాజరు కావట్లేదు. ఏదేమైనా భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చే జీఎస్టీ ప్రారంభవేడుక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వాటికి సంబంధించిన కొన్ని అప్‌డేట్లు...
* సమావేశం జరగనున్న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ను చక్కగా అలంకరించారు. జీఎస్టీ ప్రారంభం అనే విషయాన్ని గంట మోగించి తెలియజేయనున్నారు.
* రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలు ఉపన్యసించనున్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు కూడా వేదికను అలంకరించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ కూడా వేదికపైకి ఆహ్వానితుడే కానీ కాంగ్రెస్ హాజరుకాకపోనుండటంతో ఆయన కూడా రారు.
* దాదాపు 1000 మంది ఈ సమావేశానికి రానున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త రతన్ టాటా, గాయని లతా మంగేష్కర్, ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్, మాజీ గవర్నర్లు బిమాల్ జలాన్, వైవీ రెడ్డిలు కూడా హాజరుకానున్నారు.
* అందరు ఎంపీలను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆర్థిక మంత్రులను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్, డీఎంకే, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ హాజరవుతుందా? లేదా? అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
* బీహార్‌లోని జేడీయూ పార్టీ జీఎస్టీకి మద్దతు తెలిపినా కార్యక్రమానికి నితీశ్ కుమార్ గానీ, శరద్ యాదవ్ గానీ హాజరు కావడం లేదు.
* జీఎస్టీ బిల్లు ఆమోద సమయంలో సభను బహిష్కరించిన తమిళనాడు అధికార ఏఐఏడీఎంకే పార్టీ, ఇక ఇప్పుడు మద్దతు పలకడం మినహా వేరే దారి లేకపోవడంతో సమావేశానికి హాజరవనుంది.
* `ఇది చారిత్రాత్మకం ఎందుకంటే, ఇప్పటివరకు మనలో జాతీయ సమగ్రత వుంది. ఇప్పుడు ఇక ఆర్థిక సమగ్రత కూడా చేకూరుతుంది. దీనికి హాజరుకాలేక పోవడం ప్రతిపక్ష పార్టీల దురదృష్టం. సాయంకాలానికైనా వారు చేయబోతున్న తప్పు తెలుసుకుని సమావేశానికి హాజరవుతారని ఆశిస్తున్నా` అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.
* `దేశంలో ముఖ్యమైన సమస్యలు వదిలేసి ప్రభుత్వం చేస్తున్న ఈ తమాషా కార్యక్రమంలో కాంగ్రెస్ పాలుపంచుకోదు. పబ్లిసిటీ కోసం పాటుపడే పార్టీ కాదు మాది` అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. రాష్ట్రపతి అందుబాటులో ఉండగా ప్రధాని జీఎస్టీని ప్రారంభించనుండటాన్ని కూడా కాంగ్రెస్ తప్పుబట్టింది.
* చిన్న వ్యాపారులు జీఎస్టీ సంస్కరణలకు సిద్ధంగా లేరని గుర్తుచేస్తూ వారు చేస్తున్న నిరసనలను ప్రతిపక్షాలు రుజువుగా చూపిస్తున్నాయి. `జీఎస్టీ - ప్రభుత్వం చేస్తున్న మరో పెద్ద తప్పిదం` అంటూ మమతా బెనర్జీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
* `చిన్న చిన్న తప్పిదాలు లేకుండా ఏ పనీ జరగదు. వీలైనంత మేరకు ఎలాంటి తప్పులు చోటుచేసుకుండా చూస్తాం. నిజంగా ఏదైనా తప్పు గుర్తిస్తే వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరిస్తాం` అని ఆర్థిక కార్యదర్శి హస్‌ముఖ్ ఆదియా తెలిపారు.