: అందరికీ శుభవార్తే... ఇకపై రెండు ఎంఆర్పీ ధరలుండవు... సినిమా హాల్, మాల్, ఎయిర్ పోర్టుల్లో ఒకే ధర!
బయట రూ. 20కి లభించే వాటర్ బాటిల్ కు మల్టీప్లెక్సుల్లో రూ. 50, విమానాల్లో రూ. 100 వరకూ పెట్టాల్సి వుంటుంది. పది రూపాయలకు లభించే చిప్స్ ప్యాకెట్ ధర ఎయిర్ పోర్టులో రూ. 50 వరకూ ఉంటుంది. ఇలా ద్వంద్వ ఎంఆర్పీ (గరిష్ఠ చిల్లర ధర) విషయంలో ఉన్న వ్యత్యాసాలపై ఎంతో కాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్రం ఎట్టకేలకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) 2011 నాటి చట్టానికి చేసిన సవరణలను కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆమోదించారు. జనవరి 1 నుంచి అమలులోకి రానున్న చట్టం ప్రకారం, ఏ వస్తువుకూ రెండు ఎంఆర్పీ ధరలు ఉండేందుకు వీలులేదు.
దీంతో, సినిమా హాల్స్, మాల్స్, మల్టీ ప్లెక్సులు, ఎయిర్ పోర్టుల్లో ఎంఆర్పీలపై లక్షలాదిగా వస్తున్న ఫిర్యాదులకు అడ్డుకట్ట పడనుంది. ఇక మారిన నిబంధనల్లో భాగంగా, ఈ-కామర్స్ ప్లాట్ ఫాంపై విక్రయాలు జరిగే అన్ని ఉత్పత్తులపైనా రిటైల్ ధరలను ముద్రించడం తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ అధికార ప్రకటన వెలువరించింది. వినియోగదారుల కోసమే చట్ట సవరణ చేశామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రొడక్టులపై ఉండే డిక్లరేషన్ అక్షరాల సైజు కంటితో చదివేంత పెద్దవిగా ఉండాలని కూడా సవరణలో చేర్చినట్టు పేర్కొంది.