: నేను బీజేపీకి ఐటెం గర్ల్‌ని అయిపోయా!: అజాం ఖాన్ వ్యంగ్యం
భారత సైనిక దళం గురించి తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్న యూపీ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజాం ఖాన్ ఆ విషయమై మీడియాకు స్పష్టతనిచ్చారు. భారత సైన్యం నైతికతను దెబ్బతీశాయంటున్న తన మాటలను మీడియా వక్రీకరించిందని, తన ఉద్దేశం వేరని అజాం ఖాన్ తెలిపారు. `ఐనా భారత సైన్యం నైతికత నా మాటల వల్ల దెబ్బతినదు. నాకు అంత శక్తి లేదు. నరేంద్రమోదీ పాకిస్థాన్‌లో అడుగు పెట్టినపుడే ఇండియన్ ఆర్మీ నైతికత పూర్తిగా నశించింది` అని అన్నారు.
తాను అనే మాటలను ఎప్పటికప్పుడు రాజకీయం చేయడం బీజేపీకి బాగా అలవాటైందని, తాను వారికి ఐటెం గర్ల్‌గా మారిపోయానని, తన ప్రకటనలతో రాజకీయ క్రీడ ఆడడం కాషాయ పార్టీకి అలవాటుగా మారిపోయిందని అజాంఖాన్ చెప్పారు. బీజేపీకి మాట్లాడుకోవడానికి తాను తప్ప మరొకరు లేరని, యూపీ ఎన్నికల్లో కూడా తనపైనే దృష్టి పెట్టారని, వారికి తాను ఐటెం గర్ల్ అయిపోయానని ఆయన వ్యంగ్యంగా అన్నారు. జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ఆర్మీ రేపిస్టులపై మహిళలు చేస్తున్న దాడుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.