: మెనోపాజ్ ను అలా కొన్నాళ్లు వాయిదా వేయచ్చట!
ఏ సమయంలో రావాల్సింది ఆ సమయంలోనే రావాలి. ముందు వచ్చినా, తర్వాత వచ్చినా నష్టమే. ప్రస్తుత కాలంలో ఏది ఎప్పడు వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. మెనోపాజ్ (స్త్రీలలో రుతుక్రమం ఆగిపోవడం) విషయం కూడా ఇందుకు అతీతం కాదు. ఇది రావడానికి ఒక వయసు ఉంటుంది. కానీ ఈమధ్య తక్కువ వయసులోనే నెలసరులు ఆగిపోయి... కొందరిలో మెనోపాజ్ దశ ముందుగానే వచ్చేస్తోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు (మాంసకృత్తులు) తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనంలో మాంసాహారం కంటే శాకాహారం నుంచి వచ్చిన ప్రొటీన్లను తీసుకోవడం వల్ల తక్కువ వయసులో మెనోపాజ్ రాకుండా అరికట్టవచ్చని తేలింది. తద్వారా సంక్రమించే కీళ్లనొప్పులు, గుండెజబ్బులు కూడా కట్టడి అవుతాయని వారి అధ్యయనంలో తేలింది. ప్రొటీన్లు ఎక్కువగా లభించే తృణధాన్యాలు, సోయా వంటి పప్పు ధాన్యాలు తినడం మహిళల ఆరోగ్యానికి మంచిదని వారు సూచిస్తున్నారు. తినే రోజువారీ ఆహారంలో కనీసం ఆరు శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలని వారు చెబుతున్నారు.