: వేడెక్కిన నంద్యాల రాజకీయం.. నువ్వా నేనా అంటున్న టీడీపీ, వైసీపీ!
ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే నంద్యాల రాజకీయం వేడెక్కింది. భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించి నిరాశకు గురైన శిల్పా మోహన్ రెడ్డి చివరకు వైసీపీలో చేరి టికెట్ సాధించారు. మరోవైపు, నంద్యాల టికెట్ తమ కుటుంబీకులకే ఇవ్వాలంటూ పట్టుబట్టిన మంత్రి అఖిలప్రియ... చివరకు తన పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలీకృతం అయ్యారు. ఉప ఎన్నికలో పోటీ చేయబోయే ఇరు పార్టీల అభ్యర్థులు తేలిపోవడంతో... అప్పుడే ఇరు పార్టీలు ఎన్నికలో విజయం కోసం ఎత్తులు పైఎత్తులు ప్రారంభించాయి.
ప్రస్తుతం నంద్యాలలో టీడీపీ, వైసీపీల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది. ఈ ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇఫ్తార్ విందు పేరుతో నంద్యాలలో పర్యటించారు. మంత్రి నారాయణ కూడా నంద్యాలను రెండు సార్లు చుట్టేశారు. మరోవైపు భూమా అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డిలు ఇప్పటకే సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి నుంచి తెలుగుదేశం పార్టీ 'ఆశీర్వాద యాత్ర' పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. తమకు అండగా ఉండాలని ఓటర్లను అభ్యర్థించనుంది.