: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం!
రాష్ట్రం విడిపోయి మూడేళ్లు దాటినా... ఇప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పలు వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు సెగలు రేపుతూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగులు వేస్తుండటం వివాదాస్పదంగా మారింది.
ఈ వ్యవహారంపై ఏపీ నేతలు మండిపడుతున్నారు. ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టును గులాబీమయం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. గతంలో కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, నీటి పంపకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. అయితే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల జోక్యంతో ఆ వివాదం సమసిపోయింది. ఇప్పుడు ఈ తాజా వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.