: మోదీ హెచ్చరించినా వినట్లేదు... పశుమాంసం తీసుకెళుతున్నాడని హత్య!
ఈ దేశంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, గో సంరక్షణ పేరిట హత్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తుండగా, పశుమాంసాన్ని తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, జార్ఖండ్ లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. రామ్ గఢ్ జిల్లా బజ్రాతాండ్ గ్రామంలో ఓ డెయిరీ యజమానిగా పనిచేస్తున్న అలీముద్దీన్ అనే వ్యక్తి ఇంటి ముందు ఆవు ఎముకలు కనిపించగా, అతను తన మారుతీ వ్యాన్ లో వెళుతున్నవేళ, దాదాపు 1000 మంది అతన్ని అటకాయించారు.
ఆపై అతనిని దారుణంగా కొట్టి చంపేయడమే కాకుండా, అతని ఇంటికి నిప్పు పెట్టారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందేనని, అలీముద్దీన్ ఆ దారిలో వస్తాడని తెలుసుకున్న నిరసనకారులు, కాపుకాసి మరీ అతన్ని కొట్టి చంపారని తెలిపారు. నిందితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా, సోమవారం నాడు గిరిధి జిల్లాలోని బరియాబాద్ గ్రామంలోనూ ఇవే ఆరోపణలపై ఉస్మాన్ అన్సారీ అనే వ్యక్తిపై దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.