: పిల్లలతో పాటు చెరువులో దూకి చనిపోయాడనుకుంటే.. రోడ్డు మీద స్నేహితులకు కనిపించి షాకిచ్చాడు!


రంగారెడ్డి జిల్లా శామీర్‌ పేట చెరువులోకి తన ఇద్దరు పిల్లలను తోసేసి, వారితోపాటే దూకి మృతి చెందాడని భావించిన తండ్రి అర్జున్‌ అనూహ్యంగా రోడ్డు మీద కనిపించి స్నేహితులకు షాకిచ్చాడు. సికింద్రాబాద్ రసూల్ పుర కట్టమైసమ్మ ప్రాంతంలో కుటుంబంతో పాటు నివాసం ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లా చేగూరు గ్రామానికి చెందిన కొయ్యాడ అర్జున్ (36) పిల్లలకు ఈత నేర్పించేందుకు తీసుకెళ్తున్నానంటూ భార్యకు చెప్పి వెళ్లి, పాప పూజిత, బాబు ధనుష్ లను చెరువులో తోసేశాడు. స్థానికులు పూజిత మృతదేహం నీట్లో తేలుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న శామీర్‌ పేట పోలీసులు, అక్కడి పెద్దచెరువు కట్ట వద్ద లభించిన ద్విచక్రవాహనం, ఫోన్‌ నంబర్‌ ద్వారా పిల్లలిద్దర్నీ చెరువులో తోసేసి అర్జున్‌ అందులోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. దీంతో పూజిత, ధనుష్ మృతదేహాలు వెలికి తీసి అర్జున్ మృతదేహం కోసం గాలించారు.

చెరువులో అర్జున్‌ మృతదేహం దొరకకపోవడంతో బంధుమిత్రులు కృష్ణ, బాబురావు, శ్రీను, రవి తదితరులు సిద్దిపేట వైపు వెళ్లే మార్గంలో అతని కోసం వెతకడం ప్రారంభించారు. గురువారం సాయంత్రం సిద్ధిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారం వద్ద రాజీవ్‌ రహదారిపై ఉన్న హోటల్‌ లో టీ తాగేందుకు తమ వాహనాన్ని ఆపారు. అదే సమయంలో అటుగా రోడ్డు మీద తాపీగా నడుచుకుంటూ వెళ్తున్న అర్జున్‌ కనిపించాడు. దీంతో వారు షాక్ తిన్నారు. దీంతో అతనిని పట్టుకుని హోటల్ లోకి తీసుకెళ్లి  నిలదీశారు.

వ్యాపారంలో నష్టాలు రావడంతో పిల్లలను చెరువులోకి తోసేసి, తాను కూడా అందులో దూకి చావాలనుకున్నానని అయితే ఈత రావడంతో మూడు సార్లు చెరువులోకి దూకినా ఆత్మహత్య చేసుకోలేకపోయానని, అందుకే బతికిపోయానని చెప్పాడు. కాసేపటి తరువాత టాయ్ లెట్ కు వెళ్లి వస్తానని చెప్పి, దగ్గర్లోని వ్యవసాయక్షేత్రంలో విద్యుత్ వైర్లను పట్టుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. దీంతో వారు అతనిని గజ్వేల్ లోని ఆసుపత్రికి ఆ తరువాత కొంపల్లిలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News