: గంగూలీకి వీరాభిమాని... ఆటలోనూ దాదానే మరపిస్తుంది!
మహిళా క్రికెట్ లో వేగం ఉండదు, బలమైన షాట్లు ఉండవు, మైదానంలో నెమ్మదిగా కదులుతారు.. అని భావించేవారు స్మృతి మందాన (20) ఆటతీరు చూస్తే తమ అభిప్రాయం మార్చుకుంటారు. ఎందుకంటే, ఆమె ఆటలో కళాత్మక డ్రైవ్ లు, పవర్ ఫుల్ షాట్లు, అచ్చం గంగూలీని తలపించే ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆమె అమ్ములపొదిలో అస్త్రాలు. సౌరవ్ గంగూలీకి వీరాభిమాని అయిన ఈ మరాఠా ముద్దుబిడ్డ దాదా లాగే లెఫ్ట్ హ్యాండర్. ధాటిగా ఆడుతూనే... క్రీజు వదిలి ముందుకొచ్చి మిడ్ వికెట్ మీద సిక్సర్లు బాదడం ఆమెకు చాలా ఇష్టం. ఆమె కెరీర్ లో ఎన్నో ఘనతలు ఉన్నాయి. ముంబైలో పుట్టి సంగ్లిలో పెరిగిన ఆమె తండ్రి శ్రీనివాస్, సోదరుడు శ్రవణ్ నుంచి స్ఫూర్తి పొందింది. తొమ్మిదేళ్లకే మహారాష్ట్ర అండర్-15 జట్టులో, 11 ఏళ్లకే అండర్-19 జట్టులో స్థానం సంపాదించిందంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో ఊహించవచ్చు.
గుజరాత్ తో ఆడిన మ్యాచ్ లో 150 బంతుల్లో 224 పరుగులు చేసి టీమిండియాలో స్థానం సంపాదించింది. అంతే కాదు బిగ్ బాష్ లీగ్ లో హర్మన్ ప్రీత్ తరువాత స్థానం సంపాదించిన భారతీయ క్రీడాకారిణి అమేనంటే ఆశ్చర్యం కలగకమానదు. నెట్స్ లో అందరు అమ్మాయిల్లా అమ్మాయిల బౌలింగ్ లో ప్రాక్టీస్ చేసేది కాదు. జిల్లాస్థాయి క్రికెటర్ అయిన సోదరుడు శ్రవణ్ బౌలింగ్ లో చితక్కొట్టేది. 2013లో బంగ్లాదేశపై వన్డే అరంగేట్రం చేసిన ఆమె, ఆసీస్ పర్యటనలో చేసిన సెంచరీతో ఆకట్టుకుంది. స్మృతి వేసే ప్రతి అడుగు వెనుక ఆమె కుటుంబ సభ్యుల సహకారం ఉంది. ఆమె క్రీడా కార్యకలాపాలను తండ్రి చూసుకుంటే, ఆమె డైట్ ను ఆమె తల్లి స్మిత రూపొందిస్తారు. ఆమె దుస్తులు, ఇతర అవసరాలను ఆమె సోదరుడే చూసుకుంటాడు.