: 'అంకుల్.... ఈ పిగ్గీ బ్యాంక్ డబ్బులు తీసుకుని మా అమ్మ మృతి కేసును పరిష్కరించండి' ...పోలీసు అధికారిని కోరిన చిన్నారి!
పోలీసు శాఖలో అవినీతి ఎంతగా వేళ్ళూనుకుని పోయిందో తెలిపే సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన సీమా కౌశిక్ అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తరపు బంధువులు ఫిర్యాదు చేయడంతో భర్త కౌషిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు ముందుకు సాగాలంటే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి.
అయితే, ఛార్జిషీట్ వెయ్యాలంటే తనకు డబ్బులివ్వాలని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి రామ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో డబ్బులు ఇచ్చుకునే స్తోమత తమకు లేదని, న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఎంత వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఈ కేసును పరిష్కరించాలని కోరుతూ వారి కుమార్తె మాన్వి (5)... ‘పోలీస్ అంకుల్.. నా పిగ్గీ బ్యాంక్ తీసుకుని, మా అమ్మ మృతి కేసును త్వరగా పరిష్కారం అయ్యేలా చూడండి’ అంటూ తను దాచుకున్న డబ్బును రామ్ కుమార్ ముందు పెట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటన అక్కడున్నవారందరి కంట కన్నీరు తెప్పించి, పోలీసులను అసహ్యించుకునేలా చేసింది.