: పవిత్ర సంగమం వద్ద చంద్రబాబు పూజలు.. పుష్కరాల సమయంలో ఓ సంకల్పం చేశానన్న ఏపీ సీఎం
విజయవాడలో పవిత్ర సంగమం వద్ద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజలు చేశారు. పవిత్ర సంగమం వద్ద ఆయన హారతిని తిలకించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తమ ప్రభుత్వం చేసిన కృషి వల్ల గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి వస్తున్నాయని అన్నారు. గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమయంలో తాను ఒక సంకల్పాన్ని చేశానని, రాష్ట్రంలో కరవు పూర్తిగా పోవాలని తాను కోరుకున్నానని అన్నారు. రాష్ట్రంలో ఒక పక్క గోదావరి, మరో పక్క కృష్ణ ఉన్నాయని, అంతేగాక పెన్నా, వంశధార, నాగవళి వంటి నదులు ఉన్నాయని, ఆ నీరు వృథాగా వెళ్లి సముద్రంలో కలిసిపోకూడదని అన్నారు.
ఆ నీటిని చక్కగా ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరవు అన్నదే ఉండబోదని, తాము నదుల నీళ్లను మళ్లించుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. తాము దూరదృష్టితో ఆలోచించి ముందుకు వెళుతున్నామని అన్నారు. తనను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారని, తాను ఎన్నికల్లో గెలవగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి పోలవరం ముంపు మండలాలను రాష్ట్రానికి ఇవ్వమని కోరి సాధించానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. మరోవైపు పట్టిసీమను పూర్తి చేశామని చెప్పారు. కొందరు రైతులను రెచ్చగొట్టినా, కోర్టులకు వెళ్లినా తాము పట్టువీడకుండా సమర్థవంతంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము వాటిని ఎదుర్కుంటూ ముందుకు వెళతామని అన్నారు.