: మీ దళాలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే: భారత్‌కు చైనా హెచ్చరిక
కైలాశ్ మానస సరోవర్ యాత్రికులను చైనా అడ్డుకోవడంతో సరిహద్దు ప్రాంతమయిన డోంగ్‌లాంగ్ వద్ద భారత్ భద్రతను పెంచేసింది. మరోవైపు చైనా కూడా అదేపని చేసింది. ఈ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి లు కంగ్ స్పందిస్తూ తాము వెనక్కితగ్గబోమని అన్నారు. సరిహద్దు నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అప్పటివరకు తాము భారత్‌తో చర్చలు జరపబోమని చెప్పారు.
భూటాన్ ఆర్మీ క్యాంప్ ఉండే డోంగ్‌లాంగ్ లోని జోంప్లిరి ప్రాంతం వైపుగా చైనా వేస్తోన్న రోడ్డు పట్ల భూటాన్ అభ్యంతరాలు తెలుపుతుండడం పట్ల కూడా స్పందించిన లు కంగ్... ఆ భూభాగం తమదేనని పేర్కొంటూ తాము చట్టబద్ధంగానే నిర్మాణం జరుపుతున్నట్లు వ్యాఖ్యానించారు. డోంగ్‌లాంగ్ ప్రాంతం సిక్కిం సెక్టార్‌లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.