: రేపు అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలులోకి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ తీరు దురదృష్టకరం: వెంకయ్య
దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా పేర్కొంటున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం రేపు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా సెంట్రల్ హాలులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికను కాంగ్రెస్ పార్టీ పంచుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత సత్యవ్రత్ చతుర్వేది స్పష్టం చేశారు. ఈ సభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రాబోరని ఆయన చెప్పారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఇంతటి ముఖ్యమైన జీఎస్టీని అమలు చేసే సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న ఈ వేడుకను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరమని అన్నారు.
ఎన్డీఏపై కాంగ్రెస్ పార్టీ చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. విప్లవాత్మకమైన పన్ను విధానాన్ని అమలులోకి తెస్తోంటే ఈ విషయాన్ని రాజకీయ దృష్టితో చూడకూడదని ఆయన అన్నారు. దేశం యావత్తు జీఎస్టీకి మద్దతు తెలుపుతోందని చెప్పారు. ఈ బిల్లును గట్టెక్కించే ప్రయత్నాలను 2000వ సంవత్సరం నుంచి ప్రారంభించి, పలుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత, ఎన్నో చర్చలు జరిగిన అనంతరం, రాజ్యసభ, లోక్‌సభల్లో ఎన్నోసార్లు బిల్లు పెట్టగా ఇప్పటికి అమలులోకి రానుందని అన్నారు. ఈ బిల్లు పాస్ అయిన ఖ్యాతిని బీజేపీ మాత్రమే తీసుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ బిల్లు అమలులోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, జాతీయ ఆదాయం, రాష్ట్రాల ఆదాయం పెరుగుతాయని, పన్ను ఎగివేత, అవినీతి తగ్గిపోతుందని అన్నారు.