: సోషల్ మీడియా... జాగ్రత్తగా వాడయా!
ఇతరుల దృష్టిని మనవైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా వారధిగా మనం చేసే చిన్న చిన్న తప్పులే మన సర్వస్వాన్ని దొంగలపాలు చేస్తున్నాయి. దోపిడీ జరిగి పోయాక అరే... అలా చేసి ఉండకూడదే అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకే ముందు జాగ్రత్త పాటించాలి. అలా మనం చేసే తప్పులు, వాటిని చేయకుండా కట్టడి చేయగల మార్గాలు ఇవే
* లోకేషన్ షేరింగ్: ఎక్కడికైనా వెళ్తున్నారంటే చాలు... వారి ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ మధ్య బాగా అలవాటైంది. ఇది ఒక రకంగా మీరు ఇంట్లో ఉండట్లేదు అనే విషయాన్ని దొంగలకు చెప్పడమే. సో.. లోకేషన్ షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.
* ఫోన్ నెంబర్ షేరింగ్: కొంతమంది కామెంట్ బాక్సుల్లోనే ఫోన్ నెంబర్ షేర్ చేస్తుంటారు... లేదా నెంబర్ మారినపుడు కొత్త నెంబర్ ఇదే అంటూ పోస్ట్ చేస్తుంటారు. దీని వల్ల అన్‌వాంటెడ్, కాల్స్ వచ్చే ప్రమాదముంది. అసాంఘిక కార్యక్రమాలకు మీ నెంబర్ వాడుకునే అవకాశమూ లేకపోలేదు.
* ఫొటోస్ విత్ ఇన్ఫర్మేషన్: సెల్ఫీ దిగామా.. పోస్ట్ చేశామా... లైక్‌లు వచ్చాయా... ఇదే ప్రపంచం అయిపోయింది ఈ మధ్య. అంతేకానీ సెల్ఫీ దిగే ముందు మన చుట్టుపక్కల ఏమున్నాయి, ఏదైనా రహస్య సమాచారాన్ని బట్టబయలు చేస్తున్నామా? అనే సంగతి పట్టించుకోరు.
* సినిమా టిక్కెట్లు, విమాన టిక్కెట్లు షేరింగ్: క్యూఆర్ కోడ్, బార్ కోడ్ టెక్నాలజీ వచ్చాక చాలా పనులు సులభతరం అయ్యాయి. వాటితో పాటే దొంగతనం కూడా. టిక్కెట్ చిత్రాలు షేర్ చేసేముందు కొంచెం జాగ్రత్త పడండి. లేకపోతే మీకంటే ముందే మీ బార్‌కోడ్ ఉపయోగించి ఇంకొకరు టికెట్ ఉపయోగించుకునే ప్రమాదముంది.
* డేటాఫ్ బర్త్ ఇచ్చారా..: ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లో తేదీ సహా పుట్టిన రోజు వివరాలు ఇచ్చేస్తుంటాం. మన జన్మదినాన్ని మన స్నేహితులకు గుర్తు చేసి మనకు శుభాకాంక్షలు అందించడానికి ఇది మంచిదే అయినా, దీని వల్ల బ్యాంకు ఖాతాలు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా వుంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్త పడాలి.
ఇలా చెప్పుకుంటే పోతే నష్టాల చిట్టా చాలా ఉంది. నష్టం జరిగిన తర్వాత చెప్పుకోవడం కన్నా జరగడానికి ముందు కొంచెం ఆలోచిస్తే మంచిది.