: అనిల్ కుంబ్లే, ధోనీ, కోహ్లీ.. ఒక్కరేంటి అందరూ భిన్నంగానే వ్యవహరిస్తారు: శిఖర్ ధావన్
టీమిండియా మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వారి మధ్య వచ్చిన వివాదంపై టీమిండియా ఆటగాళ్ల నుంచి మీడియా పలు అంశాలను రాబట్టాలని ప్రయత్నిస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్‌కి మీడియా నుంచి ఈ ప్రశ్నే ఎదురైంది. అయితే, ఆయన దానికి తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. తాను అనిల్ కుంబ్లే శిక్షణలో ఎక్కువగా భారత్ జట్టుకు ఆడలేదని ఆయన తెలిపాడు.
దీంతో తాను ఈ విభేదాలపై ఏమీ మాట్లాడలేనని శిఖర్ ధావన్ అన్నాడు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నానని, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయం, ఆత్మాభిమానం అనేవి ఉంటాయని అన్నాడు. అనిల్ కుంబ్లే, కోహ్లీ, ధోనీ ఇలా ఎవరిపేరు చెప్పుకున్నా అందరూ భిన్నంగానే వ్యవహరిస్తారని అన్నాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ మంచి ఫాంలో ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రేపు మూడో వన్డే ఆడనుంది.