: నంద్యాల ఉపఎన్నికలో వైఎస్సార్సీపీకి డిపాజిట్ కూడా దక్కదు: మంత్రి ప్రత్తిపాటి
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీదే విజయమని, వైఎస్సార్సీపీకి డిపాజిట్ కూడా దక్కదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురషోత్తపట్నం వద్ద ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోందని, అందుకే బడ్జెట్ లో రూ.22 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను వెంటనే ఇవ్వాలని, సన్నబియ్యంతో భోజనం పెట్టాలని గురుకుల పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన రైతులతో ప్రపంచ బ్యాంక్ కు తప్పుడు ఈ-మెయిల్స్ పంపించారని ఆయన ఆరోపించారు. ఇటువంటి చర్యల ద్వారా సీఎం చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ను దెబ్బతీయలేరని ప్రత్తిపాటి అన్నారు.