: పాన్‌తో ఆధార్ లింక్ తప్పనిసరి... కానీ తొందరేంలేదు!
ఈ జూలై 1 లోపు పాన్ కార్డ్‌తో ఆధార్ నెంబర్ ను అంతా తప్పనిసరిగా అనుసంధానం (లింక్) చేసుకోవాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచి సదరు పాన్ నిరుపయోగం అవుతుందనీ ఇటీవల విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ అలా లింక్ చేసుకోవడానికి జూలై 1 చివరి తేదీ మాత్రం కాదు. తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎప్పటిలోగా అనే విషయంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి జూలై 1 తర్వాత కూడా చేసుకోవచ్చు. జూలై 1కి ముందు పాన్ కార్డు ఉన్నవాళ్లు ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ నిరుపయోగం అవుతుందని ఆదేశాలు రావడంతో లింక్ చేయడానికి అదే చివరి తేదీ అనుకొని అందరూ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించారు. దీంతో ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ నెమ్మదించింది.
ప్రభుత్వం విడుదల చేసిన సెక్షన్ 139ఏఏ ప్రకారం - `జూలై 1, 2017కి ముందు పాన్ నెంబర్ జారీ అయిన వాళ్లందరూ ప్రభుత్వం ప్రకటించనున్న తేదీలోగా తమ ఆధార్ నెంబర్‌ను పాన్‌తో లింక్ చేయాలి. అలా చేయలేకపోతే ప్రభుత్వం ప్రకటించనున్న తేదీ తర్వాత పాన్‌కార్డ్ నిరుపయోగంగా మారుతుంది` అని ఉంది. దీని ఆధారంగా చూస్తే పాన్‌కార్డ్ నిరుపయోగమయ్యే తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. కాబట్టి జూలై 1 తర్వాత కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక జూలై 1 తర్వాత నుంచి కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలనుకున్న వాళ్లు మాత్రం కచ్చితంగా ఆధార్ కార్డు పొందుపరచాల్సి ఉంటుంది.