: బ్యాంకులోనే రైతు ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న ఖాతాదారులు
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ఆంధ్రాబ్యాంకులో ఈ రోజు మధ్యాహ్నం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పురుగుల మందు పట్టుకుని వచ్చిన కొండయ్య అనే రైతు అందరూ చూస్తుండగానే దాన్ని తాగే యత్నం చేశాడు. బ్యాంకులో ఉన్న ఇతర ఖాతాదారులు అతడిని గమనించి అడ్డుకున్నారు. తన పేరిట బ్యాంకులో జమ అయిన ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా డబ్బులు ఇవ్వడం లేదని వాపోయాడు. అయితే, ఆ రైతు గతంలో తీసుకున్న రుణం ఇప్పటికీ చెల్లించనందుకే అతడి ఖాతాను స్తంభింపజేశామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆ రైతు ఆత్మహత్యాయత్నం చేయడంతో సమాచారం అందుకుని అక్కడకు వచ్చి పోలీసులు బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి కొంత డబ్బు ఇప్పించారు.