: ఆ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనంపై మండిపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్
ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కాం జరిగిందని, దీంతో ప్రతికూల ప్రభావం పడి గూగుల్, మైక్రోసాఫ్ట్, లాంకో వంటి సంస్థలు ప్రభావితం అయ్యాయని తాజాగా ఆ పత్రిక ఓ కథనాన్ని రాసింది. ఇటీవల హైదరాబాద్‌లోని మియాపూర్‌లో భారీ భూకుంభకోణం బయటపడిన విషయం విదితమే. ఈ విషయాన్నే ఆ పత్రిక ప్రస్తావించింది.
దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ పత్రిక డబ్బులు తీసుకొని రాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకు వస్తూ ఆర్థిక వ్యవస్థను తాము మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంటే కొన్ని మీడియా సంస్థలు ఇలా డబ్బులు తీసుకుని అసత్య కథనాలు రాయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
తెలంగాణపై ఇలాంటి కథనాన్ని ప్రచురించడంతో జర్నలిజంలో మరింత నీచానికి దిగజారిపోయిందని అర్థమవుతోందని కేటీఆర్ అన్నారు. సదరు పత్రిక ఈ నెల 26న ప్రచురించిన కథనంలో పేర్కొన్నవన్నీ రాష్ట్ర ఆవిర్భావానికంటే ముందువని ఆయన చెప్పారు. జరిగింది జరిగినట్టుగా రాయాల్సిన పత్రికలు, నిజమేంటో ధ్రువీకరించుకోకుండానే ఇటువంటి కథనాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.