: ప్రేమ జంట పారిపోతే...శిక్ష తండ్రి, సోదరుడికి విధించారు!
ఓ ప్రేమ జంట ఊళ్లోంచి పారిపోతే... అందుకు యువకుడి తండ్రి, సోదరుడికి శిక్ష విధించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.... కర్ణాటకలోని బీజాపుర జిల్లా సింధగి తాలూకా హాళగుండకనాళ గ్రామానికి చెందిన నింగప్ప, మాషాబీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో మాషాబీ ఇంట్లో వారు వారి వివాహానికి అంగీకరించలేదు. దీంతో తమ ప్రేమను అంగీకరించే పెద్దమనసు పెద్దలకు లేదని భావించిన వారిద్దరూ పారిపోయారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాషాబీ తండ్రి అల్లాభక్ష్ తన ఏడుగురు బంధువులతో కలిసి నింగప్ప తండ్రిని గ్రామంలోని చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నింగప్ప సోదరుడు రమేశ్ తండ్రిని విడిపించేందుకు అక్కడికి చేరుకున్నాడు. అతడిని కూడా కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో కలకేరి పోలీసులు వారిని విడిపించి, ఆసుపత్రిలో చేర్చారు. నిందితులపై కేసు నమోదు చేశారు.