: మీరు డేటింగ్ ప్రియులా?... జీఎస్టీ వస్తే మీపై పడే ప్రభావమిదే!
రేపు రాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రతి ఒక్కరి జీవితాలపైనా ఎంతో కొంత ప్రభావం చూపించనుంది. స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద పన్ను సంస్కరణగా భావించే జీఎస్టీ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందన్న సంగతి తెలిసిందే. మీరు రొమాంటిక్ ప్రియులై, తరచూ డేటింగ్ కు వెళుతూ ఉన్నవారైతే, జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందో ఓ సారి పరిశీలించండి.
డిన్నర్ డేట్: ప్రేయసి లేదా ప్రియుడితో కలసి డిన్నర్ కు వెళ్లడం అనేది అత్యంత సర్వసాధారణం. ఇక ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్ కు వెళ్లే వాళ్లకైతే ఇది శుభవార్తే. ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు, లగ్జరీ హోటళ్లు, ఏసీ రెస్టారెంట్లలో ప్రస్తుతమున్న 28 శాతం పన్ను 18 శాతానికి తగ్గుతుంది కాబట్టి, ఆ మేరకు బిల్లు భారం తగ్గుతుంది. అదే నాన్ ఏసీ రెస్టారెంట్ అయితే, బిల్లు భారం పెరుగుతుంది.
మూవీ డేట్: సినిమాకు వెళ్లే డేటింగ్ ప్రియులు మల్టీ ప్లెక్సులకు వెళితే మాత్రం అదనంగా చెల్లించుకోవాల్సి వుంటుంది. చిన్న థియేటర్లకు వెళితే కాస్తంత లాభపడొచ్చు. మల్టీ ప్లెక్సుల్లో 18 నుంచి 28 శాతానికి పెరిగిన జీఎస్టీ, రూ. 100 కన్నా తక్కువ టికెట్ ధరలుండే థియేటర్ లో 18 శాతంగా ఉంటుంది. ఇక ముంబై, నోయిడా వంటి, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఉండే జంటలైతే వారికి మరింత లాభం కలుగనుంది. యూపీలో 60 శాతంగా, ముంబైలో 45 శాతంగా, బెంగళూరులో 30 శాతంగా ఉన్న వినోదపు పన్ను 18 నుంచి 28 శాతానికి తగ్గుతుంది.
బెడ్ రూం డేట్: ఇక హోటల్ లో లేదా ఓ గదిలో జంటగా ఉండిపోయి, ఓ రాత్రి గడపాలని అనుకునే వారికి జీఎస్టీ అన్ని రకాలుగా అనుకూలమైనదే. కండోమ్ ల నుంచి గర్భ నిరోధక మాత్రల వరకూ కొత్త విధానంలో ఎంత మాత్రమూ పన్నులుండవు. ఇక హోటళ్ల బిల్స్ సైతం తగ్గి వస్తాయి కాబట్టి బెడ్ రూం డేట్ ఖర్చు తగ్గుతుంది.
విహార యాత్రకు వెళితే: నాలుగు రోజులు సరదాగా ఏదైనా రొమాంటిక్ గా ఉండే ప్లేస్ కు వెళ్లి రావాలని భావిస్తే, విమానంలో ఎకానమీ క్లాస్ తీసుకుంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది. అదే బిజినెస్ క్లాస్ ను ఎంచుకుంటే ధర పెరుగుతుంది. ఎంచుకునే హోటల్స్ లో మధ్యస్త రకం హోటల్స్ ఎంచుకుంటే మేలు. రూ. 2,500 నుంచి రూ. 7,500 వరకూ వసూలు చేసే హోటల్స్ లో 18 శాతం, అంతకు మించితే 28 శాతం పన్ను భారాన్ని భరించాల్సి వుంటుంది. ఇక సాదాసీదా హోటల్... అంటే రోజుకు రూ. 1000 కన్నా తక్కువ ధరలో తీసుకుంటే దానిపై జీఎస్టీ ఉండదు. రూ. 1000 నుంచి రూ. 2,500 మధ్య ధరలో ఉన్న గదులపై ప్రస్తుతం 25 శాతంగా ఉన్న పన్ను 19 శాతానికి తగ్గుతుంది.
క్యాబ్ ఎక్కితే..: సరదాగా ఊరు చుట్టి రావాలని క్యాబ్ ఎక్కాలనుకుంటే, జీఎస్టీ అమలుతో స్వల్పంగా లాభం చేకూరుతుంది. ప్రస్తుతం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థలపై 6 శాతంగా ఉన్న పన్ను 5 శాతానికి తగ్గనుండటమే ఇందుకు కారణం.
ప్రేయసి లేదా ప్రియురాలికి బహుమతులు ఇవ్వాలనుకుంటే: ఇది కాస్త జేబుకు చిల్లు పెట్టే అంశమే. ఎంచుకునే ప్రొడక్టును బట్టి గరిష్ఠంగా 28 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఉదాహరణకు ఫుట్ వేర్ ను ఎంచుకుంటే, రూ. 500 కన్నా తక్కువుంటే 5 శాతం, అంతకు మించితే 18 శాతం పన్నులుంటాయి. ఇక సౌందర్య పోషణ ఉత్పత్తులైతే ప్రస్తుతమున్న 22 శాతం పన్ను 28 శాతానికి చేరిపోతుంది. పురుషుల దుస్తుల్లో రూ. 1000 లోపైతే 5 శాతం, ఆ రేంజ్ దాటితే 12 శాతం బాదుడు ఉంటుంది.