: టెక్కీలకు కఠిన సమయం... వేతనాల పెంపు, ప్రమోషన్ లను నిలిపేసిన కాగ్నిజంట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ, ఆటోమేషన్ కారణంగా వేలాది మంది ఉద్యోగాలను పోగొట్టుకుంటున్న వేళ, తమ సంస్థలో వేతనాల పెంపు, ప్రమోషన్ లను కనీసం మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజంట్ కీలక ప్రకటన వెలువరించింది. వృద్ధి రేటు తగ్గడం, వ్యాపారం మందగించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అక్టోబరులో ఉద్యోగుల పనితీరును సమీక్షించి వేతనాల పెంపును నిర్ణయిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజంట్ లో 2,61,200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జిమ్ లెనాక్స్, ఇటీవల ఉద్యోగులకు లేఖ రాస్తూ, "గడచిన సంవత్సరాల్లో మాదిరిగానే బేసిక్ వేతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తాం. సీనియర్ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా, ఒకేసారి ప్రోత్సాహక నగదును అందిస్తాం" అని తెలిపారు. ఈ విషయమై అధికారికంగా స్పందించేందుకు మాత్రం కాగ్నిజంట్ నిరాకరించింది. వేతనాల పెంపు ఆలస్యం కావడం ఐటీ ఇండస్ట్రీలో గడ్డుకాలాన్ని స్పష్టంగా చూపుతోందని కొందరు సీనియర్ ఉద్యోగులు వ్యాఖ్యానించారు.