: నేటితో ఆపిల్ ఐఫోన్‌కి పదేళ్లు!
జూన్ 29, 2007లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆప్ స్టోర్ లేకుండా విడుదలైన మొదటి ఐఫోన్ కేవలం ఏటీ అండ్ టీ ల్యాబ్స్‌లో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండేది. ఆపిల్ డెవలపర్ల ఉద్దేశంలో ఐఫోన్ మొదటి మోడల్ ఒక వైఫల్యం. దాని లోపాలను సరిచేసి, మార్కెట్‌లోకి తీసుకురావడానికి వారికి సంవత్సరం పట్టింది. 2008లో ఆప్ స్టోర్ సౌకర్యంతో వచ్చిన ఐఫోన్ వారిని లాభాల బాట పట్టించింది. ఒక కంప్యూటర్ చేయగల పనులన్నింటిని ఎంతో మన్నిక గల ఐఫోన్ రూపంలోకి మార్చిన ఘనత స్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కే దక్కుతుంది. పదేళ్లలో ఒక బిలియన్ కంటే ఎక్కువ ఐఫోన్లు అమ్మిన ఆపిల్ గతేడాది 24.3 బిలియన్ డాలర్లను ఆర్జించింది.
పదో వార్షికోత్సవం సందర్భంగా విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్ 8 కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. 3డీ మ్యాపింగ్ సెన్స్, అగ్‌మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్ సపోర్ట్, ఫ్లెక్సిబుల్ ఆర్గానిక్ డిస్‌ప్లే వంటి కొత్త ఫీచర్లు ఈ మోడల్‌లో ఉండనున్నాయి. మార్కెట్‌లోకి వచ్చిన ప్రారంభంలో ఐఫోన్‌కి బ్లాక్‌బెర్రీ, మైక్రోసాఫ్ట్ కంపెనీల మొబైల్ ఫోన్లు గట్టి పోటీనిచ్చాయి. ప్రస్తుతం కేవలం గూగుల్ వారి ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రమే ఐఫోన్‌కు పోటీగా ఉన్నాయి.