: ఎన్టీఆర్ ను పడదోసే విషయంలో చంద్రబాబు విజయానికి, తన అపజయానికి కారణాలు చెప్పిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రెండు ఘటనలను పోల్చుతూ ఓ టీవీ చానల్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ప్రశ్నించిన వేళ, ఆయన ఆసక్తికర సమాధానాన్ని చెప్పారు. "ఎన్టీఆర్ ను గద్దెదింపడంలో చంద్రబాబు విజయం సాధించారు... మీరు ఫెయిల్ అయ్యారు. ఎక్కడ తేడా వచ్చింది?" అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ప్రశ్నించగా, "ఇంట్లో తిన్నవాడికి ఇంటి వాసాలు లెక్కపెట్టడం తేలిక. అతను వెన్నుపోటు పొడిచాడు. నేనెప్పుడూ వెన్నుపోటు పొడవలేదు. ఆ ఆపరేషన్ మనవల్ల కానిపని. అది మనవల్ల కాదు. అది జగత్ జంత్రీలు చేసే పని. మామూలు వాళ్లు చేసే పని కాదు" అని సమాధానం ఇచ్చారు.
తనను పదవి నుంచి దించాలని ఎన్టీఆర్ చూసినందునే, ఆయన్ను దించాలని తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. సినీ గ్లామర్ ఉపకరిస్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆనాడు ఎన్టీఆర్ ను పార్టీ పెట్టాలని ప్రోత్సహించి వెనకుండి నడిపించానని చెప్పుకొచ్చారు.