: దిగ్విజయ్ సమర్పణలో నవాజ్ షరీఫ్, హఫీజ్ సయీద్ నిర్మాణంలో రాహుల్ గాంధీ 'ట్యూబ్ లైట్' సినిమా: కలకలం రేపుతున్న సోషల్ మీడియా పోస్టు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పరాజయాన్ని కొందరు రాజకీయ విమర్శలకు వినియోగించుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ గుర్తుందా? సల్మాన్ మెడలో బూట్లు వేసుకుని సైకిల్ పై వెళుతున్న చిత్రం... దీనిని కొంతమంది మార్ఫింగ్ చేసి, ఆ పోస్టరులో సల్మాన్ ముఖాన్ని మాత్రం ఎడిట్ చేసి, అక్కడ ఏఐసీసీ డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేశారు. అంతే కాకుండా "ట్యూబ్ లైట్ " ‘కభీ నా జల్నే వాలి’ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు.
అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు చెందిన డాగీ ఫిలిమ్స్ సమర్పణలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హాఫీజ్ సయీద్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా నిర్మితమైందని ఆ పోస్టరులో పేర్కొన్నారు. దానితో పాటు ‘క్యా తుమే యఖీన్ హై కీ మైనే పీఎం బనుంగా’ అంటూ రాహుల్ పేర్కొంటున్నట్టు మరో వ్యాఖ్యను జోడించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మార్ఫింగ్ పోస్టర్ తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హత్రాస్, అలీఘడ్ ప్రాంతాల కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండు చేస్తున్నారు.