: స్మార్ట్ ఫోన్ మీ దగ్గరుంటే మీ మెదడు పని చేయదంతే!
స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఎన్నో సమస్యలున్నాయని పరిశోధనల్లో వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్ తో ఆరోగ్య సమస్యలు వస్తాయన్న దానిపై పరిశోధనలు జరుగుతుండగా, స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని అడ్రియన్ వార్డ్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా స్మార్ట్ ఫోన్ మన మెదడుపై ప్రభావం చూపుతుందని 800 మందిపై పరిశోధనలు చేసిన తరువాత ఈ విషయాన్ని నిర్ధారించినట్టు ఆయన వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ వినియోగం-మెదడు పనితీరుపై నిర్వహించిన ప్రయోగంలో కొంతమందికి స్మార్ట్ ఫోన్ తమ వద్దే ఉంచుకొమ్మని, ఇతరులను పక్క గదిలో ఉంచమని చెప్పి ప్రయోగం నిర్వహించగా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. వీరందర్నీ స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని సూచించారు. అయితే పక్కగదిలో ఫోన్ పెట్టిన వారి ఫలితాలు కొంచెం మెరుగ్గా ఉండగా... కళ్లముందు, జేబులో ఫోన్ పెట్టుకున్న వారు స్విచ్ ఆఫ్ చేసినా ఫోన్ గురించే ఆలోచిస్తూ ఉంటారని, పని చేస్తున్నా వారి దృష్టి అప్పుడప్పుడు ఫోన్ మీదకే వెళుతుందని తెలిపారు. అలా వారి ఆలోచన స్మార్ట్ ఫోన్ వైపు మళ్లడంతో వారి ఆలోచనా సామర్థ్యం తగ్గుతుందని ఆయన చెప్పారు.