: కొంపముంచిన సరదా... బ్రేస్ లెట్ ధర విని స్పృహతప్పి పడిపోయిన మహిళ!

కొంత మందికి విండో షాపింగ్ (వస్తువులేమీ కొనకుండా కేవలం వాటిని చూసి వచ్చేయడం) చేయడం సరదా. మార్కెట్ లోకి వెళ్లి అలా తాజా ట్రెండ్స్ తెలుసుకుంటూ వుంటారు. ఇలాంటి హాబీ కలిగిన చైనాకు చెందిన సోఫీ అనే మహిళ యున్నన్ ప్రావిన్స్ లోని రూయిలి నగరంలో విండో షాపింగ్ కు వెళ్లింది. అక్కడ చైనీయులు ఆరోగ్యానికి ప్రతీకగా భావించే జేడ్ (పచ్చ) బ్రేస్ లెట్ ఒకటి కంటికింపుగా కనిపించింది. దీంతో ఆమె దానిని చేతిలోకి తీసుకుంది. ఈ తొందరలో అది ఆమె చేతిలోంచి జారి కిందపడింది. రంగురాయి కావడంతో అది రెండు ముక్కలైంది. అంతే, ఆమె బిక్కచచ్చిపోయింది.

ఇంతలో షాపు యజమాని వచ్చి ఆ బ్రేస్ లెట్ ధర 3,00,000 యువాన్లు (దాదాపు రూ.28 లక్షలు) అని, చెల్లించనిదే షాపులోంచి కదలవద్దని హెచ్చరించాడు. అప్పటికే బిక్కచచ్చిన సోఫీ ఆ మాట విని అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెకు షాపులో వారు సపర్యలు చేసినా కొన్ని గంటలపాటు ఆమె కోలుకోలేదు. ఇంతలో విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు షాపు యజమానికి 70,000 యువాన్లు (రూ.6లక్షలు) తెచ్చి ఇచ్చారు.

అయితే, డబ్బు మొత్తం చెల్లించాల్సిందేనని షాపు యజమాని పట్టుబట్టడంతో ఇండిపెండెంట్‌ ఎక్స్‌ పర్ట్‌ ని పిలిపించి బ్రేస్‌ లెట్‌ ధర గణించారు. ఆయన దాని విలువ 1,80,000 యువాన్లు (రూ.17 లక్షలు) ఉంటుందని నిర్ణయించడంతో మిగతా మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

More Telugu News