: లైవ్‌లో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. చనిపోయిందంటూ వీడియో వైరల్.. బతికే ఉన్నానంటూ రిపోర్టర్ వివరణ!
పాకిస్థాన్ న్యూస్ ఛానెల్ 'టీవీ 92'లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఇర్జా ఖాన్ అనే యువతి చనిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ వదంతులు తాజాగా పాకిస్థాన్ సరిహద్దులు దాటి ఇండియాకు కూడా వ్యాపించాయి. అయితే, నిక్షేపంగా వున్న సదరు యువతి స్పందిస్తూ... తాను బతికే ఉన్నానని ప్రకటించుకుంది. తనకు సంబంధించిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోందని, అది ఓ పాత వీడియో అని, దాన్ని చూస్తూ అంతా తాను చనిపోయానని అనుకుంటున్నారని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వాపోయింది.
ఇంతకీ ఆ వీడియో సంగతి ఏంటో చూస్తే... ఇర్జా ఖాన్ ఏడాది క్రితం తమ చానెల్ తరఫున ఓ కార్యక్రమం కవరేజ్ కోసం ఇస్లామాబాద్ వెళ్లింది. ఆ కార్యక్రమ ప్రాంగణం మొత్తం కనిపించడం కోసం క్రేన్‌పై కూర్చొని లైవ్ లో మాట్లాడుతోంది. ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఫిట్స్ వచ్చి పది అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఈ సందర్భంగా కెమెరాకు చిక్కిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్‌చల్ చేస్తోంది. ఆ రిపోర్టర్ చనిపోయిందని, ఎలా చనిపోయిందో చూడండని, నెటిజన్లు ఈ వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.