: ముద్రగడ పాదయాత్ర ఓ డ్రామా: హోం మంత్రి చినరాజప్ప
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ఓ డ్రామా అని ఏపీ హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు. ఈ రోజు సాయంత్రం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఛలో అమరావతి’కి ముద్రగడ పద్మనాభం అనుమతి కోరితే.. షరతులతో అనుమతిస్తామని, ఇందుకు అంగీకరించని పక్షంలో అనుమతిచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.
పదవిలో ఉన్నప్పుడు ముద్రగడకు కాపు రిజర్వేషన్ల విషయం గుర్తులేదా? అని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. మంజునాథ కమిషన్ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్లు ప్రకటిస్తామని హోం మంత్రి చెప్పారు. కాగా, జులై 26వ తేదీ నుంచి నిరవధిక పాదయాత్ర చేపట్టనున్నట్టు ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను రెండు రోజుల క్రితం ఆయన విడుదల చేశారు.