: ఓటర్ల నమోదు కోసం ఎలక్షన్ కమిషన్ కొత్త పంథా
రానున్న 2019 ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే కొత్త ఓటర్ల నమోదుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓటర్ల నమోదు కోసం ఫేస్‌బుక్ సహాయం కోరింది. జూలై 1కి 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ `ఓటు నమోదు చేసుకోండి` నోటిఫికేషన్ పంపించేలా ఫేస్‌బుక్‌తో భారత ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకున్నట్లు చైర్మన్ నసీం జైదీ తెలిపారు. ఈ నోటిఫికేషన్ రిమైండర్‌ను ఇంగ్లిషు, హిందీతో పాటు 13 భారతీయ భాషల్లో పంపించనున్నారు.
నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే `రిజిస్టర్ నౌ` ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని జైదీ వివరించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఓటు నమోదు చేసుకుని `ప్రతి ఒక్కరికి ఓటు` అనే భావనతో ముందుకు వెళ్తున్న ఎన్నికల సంఘం లక్ష్య సాధనకు సహకరించాలని నసీం జైదీ కోరారు.