: అల్లు అర్జున్ కి కోపమొచ్చింది.. ‘సభ్య సమాజానికి నేనొక్కటే చెప్పాలనుకుంటున్నా’నన్న బన్నీ!
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవి హీరోగా పరిచయమవుతున్న ‘జయదేవ్’ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడకను ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వేడుకకి అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా వేదికపై బన్నీ మాట్లాడడం మొదలుపెట్టగానే అందరూ డీజే.. డీజే అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు.
దీంతో బన్నీకి కొద్దిగా కోపం వచ్చేసింది. ప్రేక్షకుల అభిమానానికి థ్యాంక్యూ అని వ్యాఖ్యానించిన బన్నీ... తాను 'సభ్యసమాజానికి ఒకటే మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నానంటూ 'డీజే'లోని డైలాగు కొట్టాడు. ఇటువంటి ఫంక్షన్‌లలో వేదికపై చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని, స్టేజీపై మాట్లాడే సమయంలో అలా నినాదాలు చేయకూడదని, అది సంస్కారం అనిపించుకోదని అభిమానులకి హితవు పలికాడు. ఒకరు మాట్లాడడం అయ్యాక మాత్రమే నినాదాల వంటివి చేయాలని చెప్పాడు. ఈ విషయాన్నే తాను చెప్పాలనుకుంటున్నానని అన్నాడు.