: హిందీలో డచ్ ప్రధాని ట్వీట్... అయోమయంలో నెటిజన్లు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశానికి విచ్చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే ట్వీట్ చేశారు. దీంతో భారత నెటిజన్లు అయోమయంలో పడ్డారు. ట్వీట్ చేస్తే సంతోషించడం మానేసి అయోమయం ఎందుకంటారా? ఆ ట్వీట్‌లో డచ్ ప్రధాని పదాల మధ్య స్పేస్ ఇవ్వడం మరిచిపోయారు. దీంతో ట్వీట్ మొత్తం ఒకటే లైన్‌లో గందరగోళంగా కనిపించింది. దీనికి నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు.
`డచ్ ప్రధానికి మన దేశాల మధ్య దూరం ఉండటం ఇష్టం లేదు. అందుకే స్పేస్ మర్చిపోయారు`- అంటూ కొంతమంది సెటైర్లు వేయగా, `మీరు మా భాషలో ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు`- అంటూ మరికొంతమంది హర్షం వ్యక్తం చేశారు. కొద్ది సమయం తర్వాత తప్పును సరిదిద్దుకొని హిందీలో మరో ట్వీట్ చేశారు మార్క్. డచ్ ప్రధాని హిందీలో ట్వీట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు, 2015లో ఆయన భారత పర్యటనకు వచ్చినపుడు ప్రధాని మోదీ ఆయన్ని ఆహ్వానిస్తూ డచ్ భాషలో ట్వీట్ చేస్తే, అందుకు ప్రతిగా కృతజ్ఞతలు అంటూ హిందీలో ట్వీట్ చేశారాయన.