: అమ్మతోడు.. రవితేజ గురించి భరత్ నాతో ఏమీ చెప్పలేదు: పోసాని
టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ ఆయన అంత్యక్రియలకు హాజరుకాకపోవడం పట్ల అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతోంది. భరత్ సన్నిహితుడు, సినీనటుడు పోసాని కృష్ణమురళీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ భరత్ కు సంబంధించిన పలు అంశాల గురించి చెప్పారు. రవితేజ కంటే తనతోనే భరత్‌కు ఎక్కువగా అనుబంధం ఉందని అన్నారు. వ్యసనాల వల్ల భరత్ జీవితం నాశనం అయిందని, అతి వేగంతో కారు నడపడం ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయిందని అన్నారు.
అయితే, భరత్ అంత్యక్రియలకు రవితేజ ఎందుకు రాలేదో తనకు తెలియదని పోసాని వ్యాఖ్యానించారు. భరత్ ఒంటరి జీవితం గడుపేవాడని చెప్పారు. రవితేజ గురించి భరత్ తనతో ఏమీ చెప్పలేదని, అతడి అమ్మనాన్నల గురించి కూడా తనతో ఏ సమయంలోనూ చెప్పలేదని అన్నారు. అమ్మతోడుగా చెబుతున్నానని నిజంగా భరత్.. రవితేజ గురించి నెగిటివ్ గా కానీ, పాజిటివ్ గా కానీ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదని, అయితే తాను రవితేజని భరత్ గురించి అడిగానని అన్నారు. తన తమ్ముడు మంచోడేనని రవితేజ అన్నాడని, కాకపోతే డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడని చెప్పాడని తెలిపారు. తన తమ్ముడు వచ్చి సాయం కోరితే తప్పకుండా చేస్తానని రవితేజ అన్నాడని తెలిపారు.