: మ్యూజియంగా మారనున్న గోఖలే ఇల్లు!
1900 మధ్య కాలంలో స్వాతంత్ర్య సమరయోధుడు గోపాల కృష్ణ గోఖలే నివసించిన ఇల్లును త్వరలో మ్యూజియంగా మార్చనున్నారు. పూణేలో గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (జీఐపీఈ) క్యాంపస్‌లో ఉన్న ఈ ఇంట్లో గోఖలే జీవితానికి సంబంధించిన వందల కొద్ది చిత్రాలు, ఆయన వ్యక్తిగత వస్తువులు, రచించిన, చదివిన పుస్తకాలు ఉన్నాయి.
ఈ ఇంటిని బాగుచేసి, మ్యూజియంగా మార్చడానికి పూణే మున్సిపల్ కార్పోరేషన్ రూ. 25 లక్షలు ఇచ్చినట్లు జీఐపీఈ డైరెక్టర్ రాజస్ పర్చూరే తెలిపారు. ఇప్పటికే చాలా వరకు ఇంటి పనులు పూర్తిచేశామని, సెప్టెంబర్ కల్లా మొదటి దశ పనులు పూర్తవుతాయని ఆయన వివరించారు. ఈ మ్యూజియంలో గోఖలేతో పాటు బాలగంగాధర్ తిలక్, సర్వేపల్లి రాధాకృష్ణలకు సంబంధించిన అరుదైన చిత్రాలను కూడా పొందుపరచనున్నట్లు రాజస్ చెప్పారు.
1907-1915 మధ్య భారత స్వాతంత్ర్య పోరాటంలో గోఖలే కీలకపాత్ర పోషించారు. తన గురువు మహదేవ్ గోవింద్ రనడే మార్గదర్శకంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో గోఖలే స్థాపించారు.