: 95 గంటల టూర్ లో 33 గంటలు విమానంలోనే ఉండిపోయిన మోదీ!


భారత ప్రధాని నరేంద్ర మోదీ పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్ దేశాలను 95 గంటల టూర్ లో చుట్టి వచ్చారు. ఈ 95 గంటల్లో నాలుగు రాత్రులుండగా, వాటిల్లో రెండు రాత్రులు విమానంలోనే ఉండిపోయిన మోదీ, మొత్తం మీద 33 గంటల పాటు 'ఎయిరోప్లేన్ మోడ్'లో గడిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానంలోనే ఆయన పర్యటనంతా సాగింది. పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లో ఆయన రాత్రిపూట ఉండలేదు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ కు ప్రయాణించే వేళ ఓ రాత్రిని విమానంలో గడిపిన ఆయన, అదే రోజు వాషింగ్టన్ కు పయనమయ్యారు. ఆపై అక్కడ మరో రోజు ఉండి, అక్కడి నుంచి హేగ్ కు వెళ్లి, ఆపై అదే రోజు విమానంలో మరో రాత్రిని గడిపి ఇండియాకు వచ్చేశారు.

మోదీ, ఆయనతో పాటు వెళ్లిన 50 మంది భారత బృందం వాషింగ్టన్ లోని విల్లార్డ్ కాంటినెంటల్ హోటల్ లో మాత్రమే బస చేసింది. మిగతా అంతా లిస్బన్ ఎయిర్ పోర్టు వీవీఐపీ లాంజ్, దేశాధినేతల కార్యాలయాలే మోదీకి ఆతిథ్యమిచ్చాయి. ఈ పర్యటనలో భాగంగా మొదీ పోర్చుగల్ లో 5, అమెరికాలో 17, నెద్లాండ్స్ లో 7 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 6:20కి మోదీ తిరిగి ఇండియాకు చేరుకోగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. రేపు ఆయన తన సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News