: భాగ్యనగరంలో భోజనం... అమరావతిలో టీ: కోవింద్ రాకకై వేచిచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రపతి పదవికై యూపీఏ తరఫున పోటీ పడుతున్న రామ్ నాథ్ కోవింద్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలో హైదరాబాద్, విజయవాడల్లో పర్యటించనున్న ఆయన, తనకు మద్దతు పలికిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ మంత్రులతో, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులతో సమావేశమై కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చే ఆయనకు ఘనమైన విందు భోజనాన్ని సిద్ధం చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రుచికరమైన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో భోజనం చేసే కోవింద్, ఆపై అమరావతిలో మాత్రం సాయంకాల అల్పాహార విందు, తేనీరు తీసుకోనున్నారు. కాగా, వాస్తవానికి ఈ వారంలోనే ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాల్సి వున్నప్పటికీ, కేసీఆర్ కంటి శస్త్ర చికిత్స నిమిత్తం హస్తినలో మకాం వేసి వుండటం, నెలాఖరులో జీఎస్టీ అమల్లోకి రానుండగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే ఆ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లనుండటంతో కోవింద్ పర్యటన వచ్చే వారం సాగనుంది.