: 'నారాయణ' విద్యార్థుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక తల పట్టుకుంటున్న పోలీసులు!
గత రాత్రి పక్కా ప్రొఫెషనల్ నిరసనకారుల్లా ప్రవర్తిస్తూ, ప్లాన్ చేసి నారాయణ కాలేజీలో తీవ్ర విధ్వంసం సృష్టించి లక్షలాది రూపాయల ఆస్తి నష్టాన్ని కలిగించిన ఇంటర్ సెకండియర్ విద్యార్థుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. మామూలుగా అయితే, ఇంత విధ్వంసం సృష్టించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. కానీ, విధ్వంసంలో పాల్గొన్న దాదాపు 400 మందీ మైనర్లే. వీరిని అరెస్ట్ చేయాలంటే పలు అడ్డంకులు ఉంటాయి. వీరిని జువైనల్ హోమ్ కు తరలించాలి. అదే జరిగితే వారి భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుంది. స్టడీస్ పాడవుతాయి. రిమార్కులు భవిష్యత్ అవకాశాలను దెబ్బతీస్తాయి.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకూ ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని తెలుస్తోంది. పైగా నారాయణ కాలేజీ యాజమాన్యం సైతం ఈ విషయంలో ఫిర్యాదు చేసేందుకు సుముఖంగా లేదని సమాచారం. ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలను విద్యార్థులపై తీసుకుంటే, అది ఇతర కాలేజీలపై పడుతుందన్న ఉద్దేశం వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనను సాధ్యమైనంత చిన్నదిగా చూసి, సర్దుకోవాలని కళాశాల భావిస్తుండగా, పోలీసులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ తో వదిలేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.