: వెనిజులా సుప్రీంకోర్టుపై పోలీస్ హెలికాప్టర్‌తో గ్రనేడ్ దాడి.. ఇంటెలిజెన్స్ ఏజెంటే దాడి చేసిన వైనం!
వెనిజులా సుప్రీంకోర్టుపై మంగళవారం సాయంత్రం గ్రనేడ్ దాడి జరిగింది. ఓ పోలీస్ హెలికాప్టర్ పైనుంచి కోర్టుపై రెండు గ్రనేడ్లు విసిరింది. ఈ విషయాన్ని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్ధారించారు. హెలికాప్టర్‌ను నడిపింది దేశ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏజెంటేనని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు.
‘లిబర్టీ. ఆర్టికల్ 350’ అని రాసి ఉన్న హెలికాప్టర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్టికల్ 350 అనేది ప్రజలు తమను తాము ప్రభుత్వానికి అవిధేయులుగా ప్రకటించుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి హాని కలిగినప్పుడు, ప్రజా హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ ఆర్టికల్‌ను ఉపయోగించుకుని తమనుతాము ప్రభుత్వానికి అవిధేయులుగా ప్రకటించుకోవచ్చు.
తమ ప్రభుత్వంపై అప్రజాస్వామిక దళాలు తిరగబడితే తాను, తన మద్దతుదారులు ఆయుధాలు చేపట్టాల్సి వస్తుందని అధ్యక్షుడు మదురో హెచ్చరించిన కొన్ని గంటలకే సుప్రీంకోర్టుపై ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా మదురో పేర్కొన్నారు. హెలికాప్టర్ నడిపిన వ్యక్తి పేరు ఆస్కార్ పెరెజ్ అని, వెనిజులా ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ బాడీ మాజీ కెప్టెన్ అని స్థానిక పత్రిక పేర్కొంది.