: తిరుమల కాలినడక భక్తులకు 'దివ్యదర్శనం' రద్దు: టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల కొండకు కాలినడకన చేరుకునే భక్తులకు వేగంగా స్వామివారిని దర్శనం చేయించేందుకు 'దివ్యదర్శనం' పేరిట ప్రత్యేక క్యూ లైన్ నిర్వహిస్తున్న టీటీడీ, లెక్కకు మిక్కిలిగా భక్తులు కాలినడక మార్గాల్లో వస్తున్నందున దాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. సాధారణ భక్తులకు 10 నుంచి 18 గంటల సమయం పట్టే వేళ, దివ్యదర్శనం భక్తులు 2 నుంచి 6 గంటల వ్యవధిలోనే దర్శనం ముగించుకుని బయటకు వస్తారన్న సంగతి తెలిసిందే.
ఇక దివ్యదర్శనానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండగా, అలిపిరి, శ్రీవారి నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ముఖ్యంగా వారాంతాల్లో నడిచి వచ్చే వారి సంఖ్య 35 వేల వరకూ ఉంటుండటంతో 'దివ్యదర్శనం' టోకెన్ల జారీని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. తొలి దశలో శుక్ర, శని, ఆది వారాల్లో టోకెన్ల జారీని నిలుపుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని ఆయన అన్నారు. నడక మార్గాల్లో స్థాయికి మించి భక్తులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని తెలిపారు. కాగా, వారాంతాల్లో లక్ష నుంచి లక్షా 20 వేల మంది వరకూ నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.