: పురుషులకు శుభవార్త.. వారానికి రెండుసార్లు శృంగారంతో మీ గుండె పదిలమంటున్న అధ్యయనం!
తాజా అధ్యయనం ఒకటి పురుషులకు శుభవార్త చెప్పింది. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనడం ద్వారా గుండెను పదిలపరుచుకోవచ్చని తెలిపింది. శృంగారం వలన రక్తంలోని హానికారక రసాయనాల స్థాయి తగ్గుతుందని వెల్లడించింది. ఫలితంగా జీవితాన్ని భయపెట్టే గుండె సంబంధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని వివరించింది. అధ్యయనకారుల ప్రకారం.. వారంలో పలుమార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుల్లో రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాలు దృఢంగా తయారవుతాయి.
అన్నింటికంటే ముఖ్యంగా, ప్రాణాలకు ముప్పుగా పరిణమించే హోమోసిస్టీన్ అనే రసాయనం రక్తంలో పెరగకుండా శృంగారం అడ్డుకుంటుంది. అయితే ఈ విషయంలో మహిళలకు మాత్రం అంత ప్రయోజనం ఉండదని అధ్యయనకారులు తెలిపారు. ఎందుకంటే వారిలో ఆరోగ్యకరమైన రక్త సరఫరాపై శృంగార ఉద్దీపనలు అంతగా ఆధారపడి ఉండవని పేర్కొన్నారు. ఈ కారణంగానే వారిలో హోమోసిస్టీన్ నియంత్రణలో ఉంటుందని వివరించారు. తైవాన్‌లోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ సెంటర్ అధ్యయనకారులు 20 నుంచి 59 ఏళ్ల వయసున్న 2 వేల మందికిపైగా పురుషులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.